ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు

  • జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి
  • రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి
  • జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అన్నపూర్ణ మాత్రమే కాదని, అదొక రత్నగర్భ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. "మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు" అని స్పష్టం చేస్తూ, ఈ సహజ సంపదను సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో బంగారు గనుల వెలికితీత ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రంలో ఒక సువర్ణాధ్యాయం మొదలైందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జొన్నగిరిలో పర్యటించారు. జియో మైసూర్ - డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంగారం శుద్ధి కోసం ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం. స్వర్ణగిరి నుంచే ఈ ప్రణాళిక ప్రారంభమైంది. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించే మాట్లాడుతుంది" అని అన్నారు.

ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్టుతో స్థానిక ప్రజల జీవితాలు స్వర్ణమయం కావాలని ఆకాంక్షించారు. జొన్నగిరి గ్రామాన్ని దత్తత తీసుకుని 'స్వర్ణగిరి మోడల్ విలేజ్'గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశం ఏటా 800 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోందని, తొలి ఏడాది 400 కిలోలతో ఉత్పత్తి ప్రారంభించి, భవిష్యత్తులో 50 మెట్రిక్ టన్నుల లక్ష్యానికి చేరుకుంటామని తెలిపారు. దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని వివరించారు. బంగారం తరలింపు కోసం ఇక్కడి నుంచే ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేస్తామని, ఇక్కడే ఒక జ్యువెలరీ పార్కును కూడా నెలకొల్పుతామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజ వనరుల గురించి వివరిస్తూ.. మంగంపేట బెరైటీస్, కడప సున్నపురాయి, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్, గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్, అనంతపురం, కడపలో ఐరన్ ఓర్, కేజీ బేసిన్‌లో గ్యాస్, పెట్రోల్ వంటి అపార ఖనిజ సంపద ఉందని గుర్తుచేశారు. ఈ వనరులకు విలువ జోడించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు బయటకు వెళ్లిపోయాయని, కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్‌తో పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలోని ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని, కర్నూలులో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీ, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతపురంలో 5వ తరం ఫైటర్ జెట్ల ప్రాజెక్టు, కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన, తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. "నేను రాయలసీమ బిడ్డను. ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చి తీరుతాను. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది" అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Chandrababu Naidu
Jonnagiri Gold Mines
Andhra Pradesh Mineral Wealth
Rayalaseema Industrial Development
Deccan Gold Mines Project
Swarnagiri Gold Field Kurnool

More Telugu News